మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం...... బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు


malli emarjensi raadani cheppalem



ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయ్ -మోదీ సర్కారుపై బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు -అద్వానీ చెప్పింది అక్షర సత్యం: విపక్షాలు -ఆయన వ్యవస్థ గురించి చెప్పారు.. వ్యక్తుల గురించి కాదు: 2015 జూన్ 18: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనపడిందని, దాంతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడుగా కూడా ఉన్న అద్వానీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ మాటలు నూటికి నూరుపాళ్లు నిజమని విపక్షాలు పేర్కొన్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నుంచే తీర్పు వెలువడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అయితే, బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం ఆచితూచి స్పందించాయి. అద్వానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదని, వ్యవస్థ గురించి చెప్పారని అభిప్రాయపడ్డాయి. విధ్వంసకర శక్తులు బలపడ్డాయి దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనం కావటంతో విధ్వంసకర శక్తులు బలపడ్డాయని అద్వానీ అన్నారు. ఈ పరిణామం వ్యవస్థల ధ్వంసానికి దారితీయవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ, చట్ట రక్షణ వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకత్వంలో పరిణతి లేదని చెప్పను. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి అత్యవసర పరిస్థితి రాదన్న నమ్మకంలేదు. మన రాజకీయ వ్యవస్థలోని అత్యున్నత నాయకత్వం నుంచి ఆ మేరకు భరోసా రావటంలేదు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత లోపించింది. రాజకీయ నాయకత్వం బలహీనంగా మారటంతో నాకు దానిపై నమ్మకం పోయింది. అత్యవసర పరిస్థితి విధించటం అంత తేలికేం కాదు. కానీ, ఆ పరిస్థితి రాదని మాత్రం చెప్పలేను అని పేర్కొన్నారు. ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 నుంచి 1977 వరకు దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి విధించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. నాటి ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా అద్వానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ, ఆ తర్వాత బీజేపీలో దాదాపు ఒంటరయ్యారనే అభిప్రాయం ఉంది. ఆయన గతంలోకూడా మోదీ ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు తరుచూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం, ఘర్‌వాపసీ పేరుతో ఆరెస్సెస్ శాఖలు మత మార్పిడులకు పాల్పడుతుండటంతో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ వ్యాఖ్యలు మోదీ సర్కారుపై కాదు: బీజేపీ, ఆరెస్సెస్ అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి కాదని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటించాయి. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడైన అద్వానీ ప్రధాని మోదీకి ఈ విధంగా సందేశం ఇస్తారని తాను భావించటంలేదని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య అన్నారు. ఏమైనా చెప్పదలిస్తే ఆయనకు నేరుగా మోదీని కలిసే స్థాయి ఉందని తెలిపారు. ఆయనకు ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం కనిపించటంలేదని పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యలు వ్యక్తులను ఉద్దేశించినవి కావని, వ్యవస్థల గురించే ఆయన మాట్లాడారని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ అభిప్రాయపడ్డారు. అద్వానీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ, దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు లేవు. ఆ యుగం ముగిసిపోయింది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఎంతో శక్తిమంతమైంది అని పేర్కొన్నారు. అద్వానీ మాటలు అక్షర సత్యాలు: ప్రతిపక్షాలు ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలన్నీ సమర్థించాయి. మోదీ ప్రభుత్వ విధానాల తీరును అద్వానీ పరోక్షంగా వెల్లడించారని పేర్కొన్నాయి. -మోదీ పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని అద్వానీ చెప్పకనే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చదివితే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన పాలనపై అధికార పార్టీ నుంచే తీర్పు వెలువడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో.. ప్రధాని ఎవరో.. అన్నీ ఆయనకు తెలుసు. బీజేపీలో అద్వానీ రాజనీతి నిపుణుడు. ఆయన చెప్పింది పూర్తిగా నిజం. -టామ్ వాదక్కన్, కాంగ్రెస్ ప్రతినిధి -బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో అద్వానీ ఒకరు. ఆయన ఆందోళనను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీహార్ రాష్ట్రం ప్రతిరోజూ ఎమర్జెన్సీ పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. -దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అద్వానీజీ సరిగ్గానే చెప్పారు. మోదీ సర్కారు మొదటి ప్రయోగం ఢిల్లీయేనా? - అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. -అద్వానీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాటల్లోని అంతరార్థం స్పష్టంగా అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వంలో అధికార దర్పం ఛాయలు కనిపిస్తున్నాయి. -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శి -అద్వానీ లేవనెత్తిన విషయంపట్ల ఆయన సీరియస్‌గా ఉంటే సూటిగానే చెప్పాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలెదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అధికారపక్షం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం పార్లమెంటును, ఇతర వ్యవస్థలను బలహీనపరుస్తున్నది


Followers